ఏపీ అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. గాజువాకతోపాటు పశ్చిమగోదావరిలోని భీమవరం నుంచి పోటీచేసినప్పటికీ రెండుచోట్లా నిరాశే ఎదురైంది. పవన్ కల్యాణ్ పోటీపడ్డ ఈ రెండు నియోజకవర్గాల్లోను తెలుగుదేశం పార్టీ మూడోస్థానానికి పడిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న పవన్ ఏ నియోజకవర్గం నుంచైతే సులవుగా గెలుపు గుర్రం ఎక్కవచ్చంటూ ఒక ప్రయివేటు సంస్థచేత సర్వే నిర్వహింప చేయించారు.
సర్వే నిర్వహించిన సంస్థ నాలుగు నియోజకవర్గాలను సూచించినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అయితే పవన్ కల్యాణ్ సులువుగా గెలుపు గుర్రం ఎక్కేస్తారంటూ ఇక్కడి నాయకులు, కార్యకర్తలు కూడా గతంలో పలుమార్లు ఆహ్వానం పంపించారు. ఇప్పుడు సర్వేలో కూడా ఈ నియోజకవర్గం పేరు ఉంది. సంస్థ సూచించిన మరో నియోజకవర్గం చిత్తూరు జిల్లా తిరుపతి. గతంలో ప్రజారాజ్యం స్థాపించినప్పడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేసి విజయం సాధించారుకానీ సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. తిరుపతి పట్టణంలో సామాజికవర్గ దన్నుతోపాటు అభిమానుల బలం ఎక్కువ. దీంతో తిరుపతి లేదంటే పిఠాపురం అయితే పవన్ కు బాగుంటుందంటూ పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.

No comments:
Post a Comment